AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చని కేసీఆర్‌ : భ‌ట్టి

కేంద్ర విచారణ సంస్థల నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకే సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారనీ భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకొని భట్టి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా 9 ఏళ్లలో ఎందుకు తేల్చలేదనీ, ఎక్కడ, ఎందుకు లాలూచీ పడ్డారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కుటుంబ ప్రయోజనాల కోసమే లొంగిపోయి లాలూచీ పడడం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అడగలేక పోయారనీ ఆయన విమర్శించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాటలను జనం నమ్మే స్థితిలో లేరని ఆయన విమర్శించారు. BRSను శంకరగిరి మాన్యాలకో, బంగాళా ఖాతంలోనో పడేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనీ ఆయన అన్నారు. అభద్రతతోనే బీ.ఆర్.ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ సభల్లో చెప్తున్నారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నేతలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారని, వారికి సీఎం కేసీఆర్ అడ్డుకట్ట వేసేందుకు య‌త్నిస్తున్నార‌ని భ‌ట్టి చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నది బీఆర్ఎస్ నేతలేనని ఆయన విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై గుత్తా, సుఖేందర్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డిలకు సోయలేదన్నారు. రాబొయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం రావడం ఖాయమని భ‌ట్టి విక్ర‌మార్క చెప్పుకొచ్చారు.

ANN TOP 10