బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో గుడి యాజమాన్యం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని వర్గీయులు చెప్పుకున్నప్పటికీ సరైన సౌకర్యాలు లేక భక్తులు క్యూలైన్లలో అవస్థలు పడుతున్న పరిస్థితి. క్యూలైన్లలో తొక్కిసలాట చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వృద్ధురాలికి కరెంట్ షాక్ తగడలడంతో క్యూలైన్‌లోనే కిందపోయారు. కనీస సౌకర్యాలు కూడా లేకుండా కళ్యాణోత్సవం నిర్వహించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈరోజు ఉదయం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసమేతంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతీ ఏడాది ఆషాడ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రేపు ఎదుర్కోలు ఉత్సవంతో బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవాలు ముగియనున్నాయి.