ఐటీ టవర్ ప్రారంభంతో సిద్దిపేటలో 1500 మందికి ఉపాధి వచ్చిందని, సిద్దిపేటకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. ఐటీ మినిస్టర్ కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… కలోనైనా సిద్దిపేటకు ఐటీ హబ్ వస్తుందని అనుకున్నామా..? రాష్ట్రమే రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా..? సిద్దిపేటకు సీఎం కేసీఆర్ బలమైన పునాది వేశారన్నారు. తెలంగాణకు ఆయువుపట్టు సిద్దిపేట గడ్డ. ఐటీ టవర్ ప్రారంభం రోజునే సంస్థలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం చాలా గొప్ప పరిణామమన్నారు. ఐటీ హబ్‌కు మరిన్ని నిధులు మంజూరు చేసి విస్తరిస్తామన్నారు. సిద్దిపేటలో టీ హబ్ ఏర్పాటు చేస్తామని, 2014లో రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు కేవలం రూ. 56 వేల కోట్లు మాత్రమేనని, ఇవాళ రూ. 2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని కేటీఆర్ తెలిపారు.









