‘‘బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్ కొడుకు అంటున్నడు. ఆయనకు తెలియదేమో 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేసే పార్టీ బీజేపీ కాదన్నారు. బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ ఛుగ్, ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి సంజయ్ బుధవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబమేనన్నారు. కేసీఆర్ వేసిన శిలాఫలాకాలతో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించుకోవచ్చని చెప్పారు. బీఆర్‌ఎస్ కార్యాలయాలను సెటిల్‌మెంట్లు, దోచుకోవడానికే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బీఆర్‌ఎస్ నెరవేర్చలేదన్నారు.
ఈసారి కారు గుర్తు మీద ఏ ఒక్కరూ గెలవరని జోస్యం చెప్పారు. 5 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని తెలిసే, ముందుగా కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకునే పనిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆరోపించారు. దోచుకున్న సొమ్ముతో విదేశాలకు పారిపోవడానికి సిద్ధమవుతున్నారన్నారు. ఐదు నెలల్లో కేసీఆర్ సర్కారు కూలిపోవడం, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తరుణ్‌ఛుగ్ అన్నారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.









