హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఓ కుటుంబం నుంచి చాన్నాళ్ల క్రితమే సౌదీలోని దమ్మాం నగరానికి వలస వెళ్లింది. ఆ కుటుంబానికే చెందిన అమ్మార్ అజ్హర్, ఇబ్రహీం అజ్హర్‌లు అన్నాదమ్ముళ్లు.. భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పాఠశాలలో ఇబ్రహీం 9వ తరగతి చదువుతుండగా.. అతడి సోదరుడు అమ్మార్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే అదే పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న హసన్ రియాజ్.. వారి ఇంటికి దగ్గర్లోనే నివసిస్తుంటాడు. ముగ్గురూ ప్రాణమిత్రులు కావడంతో ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తుంటారు. కలిసి తిరుగుతుంటారు.
అయితే ఇబ్రహీం గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. హైదరాబాద్‌కు వెళ్తే తిరిగి రావడానికి చాలా రోజుల సమయం పడుతుందని.. ముగ్గురూ కలిసి సరదాగా తిరగాలనుకున్నారు. మంగళవారం కారులో ముగ్గురూ కలిసి దమ్మాం రోడ్లపై షికార్లు చేశారు. అయితే వాళ్లు వెళ్తున్న కారు అదుపుతప్పి.. రోడ్డు ప్రక్కన ఉన్న ఒక చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీం, హసన్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలపాలైన అమ్మార్ పరిస్ధితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో అమ్మార్ చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్ధులకు సంతాపసూచకంగా దమ్మాంలోని భారత అంతర్జాతీయ పాఠశాల బుధవారం పాఠశాలకు సెలువు ప్రకటించింది. భారతీయ సామాజిక సేవకుడు, ఎంబసీ ప్రతినిధి అయిన నాజ్ వొక్కం.. ఈ కేసు విషయమై పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు. అంతేకాకుండా మరణానికి సంబంధించిన అధికార ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.









