రాష్ట్రంలో జోరుగా ప్రచారం
తెలంగాణ బీజేపీలో భారీగా మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ స్థానంలో సీనియర్ నాయకురాలిగా ఉన్న డీకే అరుణకు పగ్గాలు అప్పగించే అవకాశముందని ప్రచారం జోరుగా సాగుతోంది. బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఈటలకు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా పార్టీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతోంది. పార్టీలో మార్పులు చేయడంపై కసరత్తులు చేస్తోంది. ముఖ్య నేతలకు కీలక పదవులు అప్పగించడంపై కొద్దిరోజులుగా సమాలోచనలో చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించనున్నారని కాషాయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బండినే అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయించుకుంటే.. డీకే అరుణకు ఎన్నికల మేనేజ్‌మెంట్ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయట.
ఈ నెల 15న ఖమ్మం పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లక్ష మందితో ఈ సభ జరిపేందుకు కాషాయ వర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోన్నాయి. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చేలోపే రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు జరగనున్నాయని టాక్ నడుస్తోంది. పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విబేధాలను తొలగించే దిశగా అగ్ర నాయకత్వం సీరియస్‌గా కసరత్తులు చేస్తోంది.
బండి సంజయ్ మీద అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు ఫార్ములా రెడీ చేసింది. బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి కీలక పదవులు ఇవ్వడం ద్వారా పార్టీలోని గొడవలు తొలగిపోతాయని, దీని ద్వారా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తారని కమల వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఈటల, డీకే అరుణలకు కీలక పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.









