AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిద్రిస్తున్న చిన్నారిపై నుంచి వెళ్లిన కారు.. మూడేళ్ల పాప మృతి

పొట్టకూటి కోసం కూలీ పనులు చేసేందుకు వచ్చిన ఓ మహిళ.. తన మూడేళ్ల చిన్నారిని సెల్లార్ నీడలో నిద్రపుచ్చుదామనుకుంది గానీ, అదే ఆ పాపకు శాశ్వత నిద్ర అవుతుందని ఊహించలేకపోయింది. ఊహించని ప్రమాదంతో తన గారాలపట్టీని కోల్పోయి కన్నీరుమున్నీరవుతోంది. హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లెక్చరర్స్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెల్లార్‌లో పనులు జరుగుతున్నాయి. ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారిని వెంటబెట్టుకొని అక్కడ పనులు చేసేందుకు వచ్చింది. ఆ పాప అక్కడే కాసేపు ఆడుకుంది.

మధ్యాహ్న భోజనం తినిపించిన తర్వాత పాపను ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఖాళీగా ఉన్న ప్రదేశంలో టవల్ పరిచి, పడుకోబెట్టింది. సెల్లార్ నీడన హాయిగా నిద్రపోతుందని భావించి, తాను తిరిగి పనుల్లో నిమగ్నమైంది. కాసేపటి తర్వాత ఆ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ కారు.. సెల్లార్‌లోకి వచ్చింది. కారును నడుపుతున్న వ్యక్తి.. పార్కింగ్ ప్రదేశంలో చిన్నారిని గమనించకుండా నేరుగా ముందుకు తీసుకొచ్చాడు. వాహనం ముందు టైరు చిన్నారి మీద నుంచి పోవడంతో ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బిడ్డను కోల్పోయిన ఆ నిరుపేద మహిళ.. గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10