దీపావళి పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఇండియాకి రావాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. అల్బనీస్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇందులో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత అల్బనీస్ ను మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు.
ఈ ఏడాది జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను చూసేందుకు రావాలని పిలిచారు.సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో ప్రధాని మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. హౌస్‌లోని సందర్శకుల పుస్తకంపై మోదీ సంతకం చేశారు. కాగా, అంతకుముందు మంగళవారం ఆస్ట్రేలియాలోని అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులు, వ్యాపార నేతలతో మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. సాంకేతికతతో పాటు వివిధ రంగాల్లో భారతీయ కంపెనీలతో సహకారం పెంపొందించుకోవాలంటూ వారికి పిలుపునిచ్చారు.