చెన్నై : ఐపిఎల్ సీజన్16లో భాగంగా బుధవారం జరిగే ఎలిమినేటర్ సమరంలో మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్2కు అర్హత సాధిస్తోంది. ఓడిన టీమ్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తోంది. లీగ్ దశలో రెండు జట్లు కూడా అద్భుత ఆటను కనబరిచాయి. లక్నో ఆరంభం నుంచే నిలకడైన ప్రదర్శన చేయగా ముంబై మధ్యలో పుంజుకుంది. ఆరంభంలో వరుస ఓటములు చవిచూసిన ముంబై ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో అలరించింది. లక్నో కూడా నిలకడైన ఆటతో లీగ్ దశలో మూడో స్థానాన్ని సొంతం చేసుకుం ది. చెన్నైతో సమానంగా 17 పాయింట్లు సాధించినా రన్‌రేట్‌లో వెనుకబడడంతో మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఎలిమినేటర్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయం.
జోరుమీదున్న ముంబై..
ఒక దశలో టాప్6లో చోటు సంపాదించడమే కష్టమని భావించిన ముంబై ఇండియన్స్ ఏకంగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించి పెను ప్రకంపనలు సృష్టించింది. కీలక సమయంలో అనూహ్యంగా పుంజుకున్న ముంబై నాకౌట్‌కు దూసుకొచ్చింది. ముంబై 200కి పైగా భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తూ ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. హైదరాబాద్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు జట్టుకు శుభారంభం అందిస్తున్నారు.