జూనియర్ పంచాయతీ సెక్రటరీల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాశారు. తమ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు.
వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని విమర్శించారు. దేశంలోనే మా పంచాయితీలు ఆదర్శం అందుకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది అని గొప్పలు చెప్పుకుంటోందని.. ఆ గొప్పల వెనుక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పడిన శ్రమ ఉందన్నారు. వారి కష్టంతో రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని ఆయన తెలిపారు.