తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తూ.. ఫౌం హౌజ్ లు కట్టిన వారు తప్పించుకోలేరని అన్నారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల పై మంత్రులు కన్నేశారని.. సీఎం కేసీఆర్ ఫాం హౌజ్ కట్టారని మంత్రులు సైతం కడుతున్నారని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మూడో ఫామ్ హౌస్ కడుతున్నారని.. ఎన్నికల అఫిడవిట్ లో చూపించింది ఎంత..? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు. 165 ఎకరాలకి కాంపౌండ్ కట్టారని.. అధికారికంగా రిజిస్టర్ అయ్యింది మాత్రం 80 ఎకరాలేనని తెలిపారు.
కృష్ణా నది లోపల ఆరు మీటర్ల ఎత్తున గోడ కట్టారని, కృష్ణానదిని ఆక్రమించి ఫాం హౌజ్ కట్టారని ఆరోపించారు. ఫామ్ హౌజ్ లో మూడున్నర ఎకరాల సీసీ రోడ్ వేశారని తెలిపారు.బినామీల పేరుతో ఎనిమిది కోట్ల సబ్సిడీ కాజేశారని తెలిపారు.ఈటల రాజేందర్ అసైన్డ్ భూములు కొన్నారని పార్టీ నుంచి బయటికి పంపారని గుర్తు చేశారు. ఈటెల భూములు కొన్నారనే ఆరోపణలతో ఆయనపై చర్యలు తీసుకున్నారని.. మరి వ్యవసాయ శాఖ మంత్రి వ్యవహారంపై కేసీఆర్ ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు.ఆరోపణలు వచ్చాయని ఈటెల పై యాక్షన్ తీసుకున్నట్టే.. ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవాలని.. అవినీతిని ఉపేక్షించవద్దని కేసీఆర్ ని కోరారు.









