గడిచిన 12 ఏళ్లలో భారతదేశం ప్రపంచ డిజిటల్ శక్తిగా అవతరించింది. ఒకప్పుడు కేవలం టెక్నాలజీ వినియోగదారుగా ఉన్న దేశం.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీస్, డేటా సెంటర్లు వంటి అత్యాధునిక రంగాల్లో ప్రపంచ స్థాయి పరిష్కారాలను సృష్టించే స్థాయికి ఎదిగింది. బలమైన ప్రభుత్వ విధానాలు, విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం ఈ మార్పునకు దోహదపడ్డాయని సోమవారం విడుదల చేసిన అధికారిక ఫ్యాక్ట్-షీట్ వెల్లడించింది.
‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం కీ రోల్
ఈ భారీ పరివర్తనకు ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2014లో 25.15 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్లు 2026 నాటికి 102 కోట్లకు పైగా పెరిగాయి. ఇదే సమయంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 6.1 కోట్ల నుంచి దాదాపు 100 కోట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ కవరేజీ 42 లక్షల రూట్ కిలోమీటర్లకు పైగా విస్తరించగా, దాదాపు అన్ని జిల్లాలకు 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి.
అత్యాధునిక టెక్నాలజీల రంగంలోనూ భారత్ తన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ‘నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్’ కింద దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో 47 పెటాఫ్లాప్‌ల సామర్థ్యంతో 38 సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ‘పరం రుద్ర’ వంటి సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా రూ.10,300 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించిన ‘ఇండియాఏఐ మిషన్’ ద్వారా 38,000కు పైగా జీపీయూలతో కూడిన కంప్యూటింగ్ సదుపాయాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏఐ కోశ్’ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే 20 రంగాలకు చెందిన 12,000కు పైగా డేటాసెట్లు, 300కు పైగా ఏఐ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
మంచి ఫలితాలిస్తోన్న ‘సెమికాన్ ఇండియా’
సెమీకండక్టర్ల తయారీలో స్వావలంబన కోసం రూ.76,000 కోట్లతో ప్రారంభించిన ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.1.64 లక్షల కోట్ల విలువైన 12 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ, చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్లు ఉన్నాయి. మరోవైపు, క్వాంటం టెక్నాలజీలోనూ భారత్ ముందంజ వేస్తోంది. రూ.6,003.65 కోట్ల కేటాయింపులతో ‘నేషనల్ క్వాంటం మిషన్’ను ప్రారంభించి, పలు స్టార్టప్‌లకు మద్దతు ఇస్తోంది. ఇటీవల 1,000 కిలోమీటర్ల దూరానికి సురక్షితమైన క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా ప్రదర్శించింది.
దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం కూడా వేగంగా పెరుగుతోంది. 2020లో 375 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యం, 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగి దాదాపు 1,500 మెగావాట్లకు చేరింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, జామ్‌నగర్ ప్రధాన హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) విషయంలో ఆధార్, యూపీఐ, డిజిలాకర్, కోవిన్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. డీపీఐ సహకారం కోసం ఇప్పటికే 23 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోగా, సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 38వ స్థానానికి మెరుగుపడిన ర్యాంకు
ఈ స్థిరమైన ప్రగతి ఫలితంగా ‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్’లో భారత్ ర్యాంకు 2015లో 81వ స్థానం నుంచి 2025 నాటికి 38వ స్థానానికి మెరుగుపడింది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పరిశోధనలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడులతో భవిష్యత్ టెక్నాలజీలకు, ఆవిష్కరణలకు భారత్ విశ్వసనీయమైన గ్లోబల్ హబ్‌గా మారుతోందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.








