తెలంగాణలో గ్రామీణాభివృద్ధికి పలు జాతీయ అవార్డులు రావడంపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామాల సర్పంచులకు, స్థానిక అధికారులకు అభినందనలు తెలిపారు. అయితే ఇదే విషయంలో బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించడాన్ని ఆయన ఖండించారు. పార్టీ ఆఫీస్ లో ఎన్వీఎస్ఎస్ మీడియాతో మాట్లాడుతూ..గులాబీ లీడర్లకు కౌంటరిచ్చారు.
ఈ అవార్డులు కేసీఆర్ పనితీరు,ఆయన పరిపాలనను మెచ్చి ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని,కానీ అవి ముఖ్యమంత్రిని మెచ్చి ఇచ్చినవి కాదని అన్నారు.సర్పంచ్లు ,స్థానిక అధికారి పనితీరును మెచ్చిఇచ్చిన అవార్డులు అని తెలిపారు.ఏ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఢిల్లీకి వెళ్ళలేదని,తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాత్రం తానేదో సాధించినట్లు చంకలు ఎగిరేసుకుంటూ ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవ చేశారు.ఏ అవార్డు..దేనికి వచ్చిందో కూడా మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి తెలియదని కామెంట్ చేశారు.గ్రామాలు,పట్టణాల మధ్య పోటీతత్వం పెంచేందుకే ఈ అవార్డుల ప్రదానోత్సవమని..ఈ విషయాన్ని బీఆర్ఎస్ లీడర్లు గుర్తించాలని సూచించారు.









