AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కడుపు నొప్పితో వెళ్తే 17 ఏళ్ల బాలుడి కడుపులో గర్భాశయం..!

ఒక బాలుడి శరీరంలో స్త్రీ పునరుత్పత్తి అవయవం బయటపడిన విచిత్రమైన, అత్యంత అరుదైన వైద్య ఉదంతం వికారాబాద్ జిల్లా పరిగిలో వెలుగు చూసింది. తీవ్రమైన కడుపు నొప్పి, వృషణ సంచిలో వాపుతో బాధపడుతున్న 17 ఏళ్ల కౌమార దశలోని బాలుడికి శస్త్రచికిత్స చేసిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు.. అతడి శరీరంలో గర్భాశయం ఆనవాళ్లు ఉండటాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు.

మల్కాపూర్ గ్రామానికి చెందిన సదరు బాలుడికి పదేళ్ల వయసున్నప్పుడే వృషణం కిందికి దిగని సమస్య తలెత్తింది. అప్పట్లో ఆపరేషన్ చేసినప్పటికీ వృషణం ఆచూకీ దొరకలేదు. తాజాగా నొప్పి తీవ్రం కావడంతో పరిగిలోని ఛత్రజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్యులు మరోసారి లోతుగా శస్త్రచికిత్స చేపట్టగా, పురుషుడి అంతర్గత భాగాల్లో ఉండకూడని గర్భాశయం కనిపించింది.

ఇది వైద్య పరిభాషలో అత్యంత అరుదుగా సంభవించే ‘పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్’ (పీఎండీఎస్‌) అనే జన్యుపరమైన సమస్య అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. బాహ్యంగా మగ శారీరక లక్షణాలు ఉన్నప్పటికీ, లోపల గర్భాశయం లాంటి స్త్రీ అవయవాలు పెరగడం ఈ లోపం ప్రధాన లక్షణం. ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌ను వైద్య బృందం ఎంతో చాకచక్యంగా పూర్తి చేసింది. ప్రస్తుతం సదరు బాలుడు ప్రమాదం నుంచి బయటపడి వేగంగా కోలుకుంటున్నాడని వైద్యులు స్పష్టం చేశారు.

ANN TOP 10