AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మగ ఉద్యోగులకు 15 రోజులు పితృత్వ సెలవులు..! సీఎం విజయ్ కీలక నిర్ణయం..

తమిళనాడులోని పెళ్లైన పురుష ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీపి కబురు అందించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పురుష ఉద్యోగులకు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు (Paternity Leave) మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు గురువారం తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మగ ఉద్యోగులు తమ వెసులుబాటును బట్టి ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు. బిడ్డ పుట్టబోయే తేదీకి 15 రోజుల ముందు నుంచైనా లేదా బిడ్డ జన్మించిన ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఈ 15 రోజుల సెలవులను తీసుకునే అవకాశాన్ని తమిళనాడు ప్రభుత్వం కల్పించింది.

ప్రస్తుతం తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల పాటు ప్రసూతి సెలవులు (Maternity Leave) అందుబాటులో ఉన్నాయి. ఇదే తరహాలో తమకు కూడా పితృత్వ సెలవులు మంజూరు చేయాలని పురుష ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. వారి అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం.. ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా విజయ్ ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. ప్రసవ సమయం అనేది తల్లికి, నవజాత శిశువుకు ఎంతో కీలకమైనదని పేర్కొంది. ఆ సమయంలో తల్లికి శారీరకంగా, మానసికంగా తగిన తోడ్పాటు అవసరమని అభిప్రాయపడింది. అలాగే బిడ్డ సంరక్షణలో తండ్రి భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ప్రభుత్వం భావించింది. ప్రసూతి సమయంలో భార్యకు అండగా నిలవడంతో పాటు.. నవజాత శిశువు పెంపకంలో తండ్రులు తమ బాధ్యతను పంచుకునేందుకు వీలుగా ఈ సెలవులను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం వివరించింది.

ANN TOP 10