తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భ్రమల్లో బతుకుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆయన వంద శాతం ఓడిపోవడం ఖాయమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో పర్యటించిన ఆయన పలు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో 90 శాతం సీట్లు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి భ్రమపడుతున్నారని ఈటల ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే 10 నుంచి 15 ఏళ్ల దాకా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ కార్యకర్తలే స్వయంగా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈటల ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకుందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.








