AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమల చరిత్రలో అపూర్వ ఘట్టం.. శ్రీవారికి 121 కిలోల స్వర్ణాభరణాల విరాళం..!

తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. కలియుగ దైవానికి ఓ భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. కొంతకాలంగా గోప్యంగా ఉన్న ఈ భారీ విరాళం దాత వివరాలు నేడు వెలుగులోకి వచ్చాయి. చెన్నైకి చెందిన ‘వర ఫ్యూచర్ ఎల్ఎల్‌పీ’ సంస్థ ఛైర్మన్ వర్ధమాన్ జైన్ ఈ చారిత్రాత్మక కానుకను స్వామివారికి అందించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సైతం హాజరయ్యారు.

ఈరోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న వర్ధమాన్ జైన్, అనంతరం 121 కిలోల స్వర్ణాభరణాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా టీటీడీ ఈవోకు అందజేశారు. ఈ ఆభరణాలను స్వామివారికి శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించేలా ప్రత్యేకంగా తయారు చేయించడం విశేషం. 

కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, వడ్డాణం, పాదుకలు సహా మొత్తం 46 రకాల ఆభరణాలను ఇందులో ఉన్నాయి. టీటీడీ అధికారులు, అర్చకులు, బొక్కసం అధికారుల సూచనల మేరకు వీటిని ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థతో తయారు చేయించారు.

తన కంపెనీలో 60% వాటాను విక్రయించగా వచ్చిన రూ.6 వేల కోట్లలో కొంత భాగాన్ని స్వామివారికి సమర్పించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ మాట ప్రకారం నేడు ఈ భారీ విరాళాన్ని అందజేశారు. ఈ ఆభరణాలను ప్రదర్శించేందుకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.

వర్ధమాన్ జైన్ శ్రీవారికి విరాళాలు సమర్పించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2025 జనవరి 19న రూ.6 కోట్లు, ఈ ఏడాది మే 16న ఓ ఎలక్ట్రిక్ బస్సును కూడా ఆయన విరాళంగా అందించారని టీటీడీ అధికారులు తెలిపారు. రేపు స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం ఈ నూతన స్వర్ణాభరణాలను అలంకరించనున్నారు. ఒకే భక్తుడు ఇంత భారీ మొత్తంలో బంగారం కానుకగా ఇవ్వడం తిరుమల చరిత్రలో ఇదే ప్రథమం అని అధికారులు పేర్కొంటున్నారు.

ANN TOP 10