AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాలి..! కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు..

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ వంటి మహనీయులు మనకు రాజ్యాంగాన్ని అందించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గతంలో రాచరిక వ్యవస్థలో రాజుల వారసులకే అధికారం దక్కిదన్నారు. కానీ, పాలన సామాన్య ప్రజల చేతుల్లోకి రావాలంటే రాజ్యాంగం అవసరమని నెహ్రూ, అంబేడ్కర్ భావించారని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన వందల ఏళ్ల వరకు అక్కడ మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ, మన దేశంలో అంబేడ్కర్ ఆలోచనలతో గిరిజనులు, దళితులు, మహిళలు, మైనార్టీలు అందరికీ సమానంగా ఓటు హక్కు లభించిందని ఆయన వివరించారు. ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుని ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ప్రజాస్వామ్యం కల్పించిన గొప్ప అవకాశం ఇదని ఆయన అన్నారు.

కొందరు తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. గతంలో పాలకులను రాజ్యాంగం నిర్ణయిస్తే.. దురదృష్టవశాత్తు నేడు పాలకులే ఓటర్లను నిర్ణయించే పరిస్థితి వచ్చిందన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలకు చెందిన 13 కోట్ల ఓట్లను ఇప్పటికే తొలగించారు. మరో 7 కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్లధనం తెస్తామని ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా నాలుగోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

స్వాతంత్ర్య సాధన, సమాన అవకాశాల కల్పన కోసం 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అహింస మార్గంలో స్వాతంత్ర్యం సాధించిన ఘనత కాంగ్రెస్‌దని, దేశం కోసం గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం పుట్టిన కాంగ్రెస్ వందేళ్ల క్రితం ఉంది.. ఇప్పుడు ఉంది.. మరో వందేళ్లూ ఉంటుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం పక్షాన నిలిచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు

ANN TOP 10