AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘9/11 తరహా విషాదాన్ని అడ్డుకున్న భారతీయుడు’.. కెప్టెన్‌ స్మిత్‌పై మోదీ ప్రశంసలు..

ఫ్లైదుబాయ్‌ విమానంలో పెను ప్రమాదాన్ని అడ్డుకున్న భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తీవ్రంగా గాయపడినా సమయస్ఫూర్తి, ధైర్యంతో వ్యవహరించి 9/11 తరహా విషాదాన్ని అడ్డుకున్నారని కొనియాడారు. గురువారం ఢిల్లీలో జరిగిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శతాబ్ది వేడుకల్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

“కెప్టెన్‌ స్మిత్‌ అసాధారణమైన సహనం, సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని చెప్పినట్లు.. ఒక భారతీయుడు 9/11 తరహా విషాదాన్ని అడ్డుకున్నాడు” అని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు కూడా స్మిత్‌ను ‘హీరో’గా అభివర్ణించిన ప్రధాని.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు బుధవారం బయలుదేరిన ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానంలో కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్మిత్‌ మచ్ఛార్‌పై దాడి చేసి కో-పైలట్‌ విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా కిందకు దిగొచ్చింది. దాదాపు 17,000 అడుగుల ఎత్తు ఒక్క నిమిషంలోనే కోల్పోయినట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వివరాలు వెల్లడించాయి.

తీవ్రంగా గాయపడిన స్మిత్‌ మచ్ఛార్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచేందుకు ప్రయత్నించడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లగలిగారు. అనంతరం దాడికి పాల్పడిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో 174 మంది ఉన్నారు.

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కూడా స్మిత్‌ ధైర్యాన్ని ప్రశంసించారు. ఆయన చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విషాదానికి దారితీసే ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. స్మిత్‌ ప్రస్తుతం సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు భారత అధికారులు తెలిపారు.

ANN TOP 10