అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తూముకుంట గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు సభ్యుడి నామినేషన్ దాఖలు చేసే విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కూటమి నేతల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తూముకుంట గ్రామ పంచాయతీలో టీడీపీ తరఫున వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు రఘుపతి నాయుడు నామినేషన్ వేసేందుకు వచ్చాడు.
ఆ సమయంలో అక్కడకు చేరుకున్న వైసీపీ నాయకుడు రామ్మోహన్ నాయుడు ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన రామ్మోహన్ నాయుడు, రఘుపతి నాయుడిపై దాడి చేసి ఆయన కుడి చెవిని బలంగా కొరికేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రఘుపతి నాయుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన చెవిలోని కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది.
ఈ అమానుష ఘటనపై బాధితుడు రఘుపతి నాయుడు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ కక్షతో తనపై దాడికి పాల్పడి, తీవ్రంగా గాయపరిచిన రామ్మోహన్ నాయుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.








