టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఒంగోలు కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ. 95 లక్షల భారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కీలక తీర్పు వెలువరించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేశ్ తన నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరిట రూ. 95 లక్షల విలువైన చెక్ ఇచ్చారు. అయితే, బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. నగదు చెల్లింపు విషయంలో న్యాయం జరగకపోవడంతో బాధితుడు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుపై న్యాయస్థానంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, నేరం రుజువు కావడంతో కోర్టు బండ్ల గణేశ్‌ను దోషిగా తేల్చింది. ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తంతో పాటు, ఈ కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేశే పూర్తిగా భరించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
గతంలోనూ పలు చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేశ్‌కు న్యాయస్థానాలు జైలు శిక్షలు విధించగా, ఆయన పైకోర్టుల్లో అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.








