తెలంగాణలోని కోటి పేద కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించేలా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’ విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అన్ని బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం తన నివాసంలో ‘ఇందిరమ్మ బీమా’, ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’పై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం వివిధ శాఖల ద్వారా రూ. 2 లక్షల వరకు జీవిత బీమా, రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులో ఉందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఈ పథకాలన్నింటినీ ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకువచ్చి, జీవిత బీమా మొత్తాన్ని రూ. 5 లక్షలకు పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే, ప్రమాద బీమా ప్రయోజనాలు యథాతథంగా కొనసాగుతాయని, ప్రస్తుత లబ్ధిదారులెవరూ నష్టపోకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ పథకం దరఖాస్తుల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు. దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని, ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఇదే సమావేశంలో, అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలని, పంపిణీ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








