AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన..! పెరుగుతున్న మృతులు..

ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విద్యార్థులు నివాసం ఉంటున్న భవనం దాదాపు ఐదు దశాబ్దాల నాటిది. ఘటన గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని శిథిలాలను తొలగించేందుకు రాత్రంతా శ్రమించాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనకు కొద్ది క్షణాల ముందు ఓ వృద్ధురాలు అక్కడి నుంచి పారిపోయినట్టు కనిపించింది.

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల భవనం ఉంది. ఈ భవనాన్ని హాస్టల్ డేజ్ పేరుతో బాయ్స్ పెయింగ్ గెస్ట్ హౌస్‍గా వినియోగంలో ఉంది. అంతేకాదు పీజీ వసతి గృహంగా ఉపయోగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా ఈ భవనం పేకమేడలా కుప్పకూలింది. విద్యార్థులు నివాసం ఉంటున్న ఆ భవనంలో  పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కూలిపోయిన భవనం ఎదుట ఉన్న ప్రాంతం నుండి తాజాగా సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఆ భవనం కూలిపోతున్నప్పుడు ఒక దుకాణదారుడు ప్రాణాలతో బయటపడటం అందులో ఉంది. కొన్ని సెకన్లలో భవనం అంతా కూలిపోయినట్టు కనిపిస్తోంది.

భవనం గేటు బయట చిన్న దుకాణం వద్ద కూర్చున్న ఓ వృద్ధురాలు ఉంది. అకస్మాత్తుగా సిమెంట్ దుమ్ము కింద పడటం ప్రారంభమైనట్లు స్పష్టంగా ఉంది. ఏదో జరగబోతోందని గమనించిన ఆ వృద్ధురాలు అక్కడి నుంచి పారిపోయింది. మరొక ప్రాంతానికి చేరుకున్న క్షణాల వ్యవధిలో భవనమంతా కూలిపోయింది. ఫలితంగా ఆ ప్రాంతమంతా దుమ్ముదూళి వ్యాపించింది. లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 11 మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయి. అయితే విద్యార్థులతోపాటు కొందరు దాదాపు 30 నుంచి 50 మంది శిథిలాల కింద చిక్కుకుని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా భవనం యజమాని హరిరామ్‌ను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు గురుగ్రామ్‌తోపాటుపలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆ సమయంలో హరిరామ్ ఇంట్లో లేకపోవడంతో హరిరామ్ పరారీలో ఉన్నట్లు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పునాదుల్లోకి నీరు వెళ్లిపోయి బలహీనపడి ఉండవచ్చని స్థానికులుచెబుతున్నారు. యజమాని హరిరామ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ, ఢిల్లీ అగ్నిమాపక సేవలు, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ, క్యాట్స్-సివిల్ డిఫెన్స్ బృందాలు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాయి. భవనం కూలిన ప్రాంతాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సందర్శించారు. ఘటన జరిగిన తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

ANN TOP 10