సీఎం రేవంత్ రెడ్డి విద్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంతో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా కేంద్రంలో భారీ ఆందోళన చేపట్టారు. హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన కవిత అక్కడి నుంచి 3 కి.మీ.ల దూరంలోని హన్మకొండ కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కవిత ఫీజు పోరుయాత్ర ఓరుగల్లు నగరం దద్దరిల్లింది. భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్న కవిత సహా విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. విద్యార్థులతో కలిసి కవిత కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద నడి ఎండలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంటకు పైగా ఆందోళన చేసిన అనంతరం అధికారులు కవిత సహా విద్యార్థులను కలెక్టరేట్ లోపలికి అనుమతించారు.
అంబేద్కర్ సర్కిల్ లో, కలెక్టరేట్ ఎదుట విద్యార్థులను ఉద్దేశించి కవిత మాట్లాడారు. ప్రభుత్వం రూ.13 వేల కోట్లకు పైగా ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉందని.. టైం బాండ్ నిర్దేశించుకొని ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్య వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని అన్నారు. మొన్న ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దు చేస్తానని అన్నారని.. ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కారణంగా విద్యార్థుల జీవితాలు ఆగమావుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో పేదలు, ఆడబిడ్డలు చదువుకు దురువుతున్నారని తెలిపారు. ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీలు పూర్తి చేసినా రీ యింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో కాలేజీల యాజమాన్యాలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని గతంలో తాను శాసనమండలి సభ్యురాలిగా సభలో లేవనెత్తానని గుర్తు చేశారు. తాను శాసన మండలిలో ప్రశ్నించినప్పుడు నెల నెలా ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పారని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలను ఆగం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి బకాయిలు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న కాలేజ్ మూత పడుతున్నాయని అన్నారు. ఫీ రీయింబర్స్ మెంట్ పై ఆధారపడి చదువుకునే విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. ప్రభుత్వం ఫీజు చెల్లించపోతుండటంతో చాలా మంది పేద విద్యార్థుల విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిల కారణంగా ఆడపిల్లలే ఎక్కువ నష్టపోతున్నారని, ఫీజులు కట్టే స్తోమత లేక వారి తల్లితండ్రులు ఆడపిల్లలను చదువుకు దూరం చేస్తున్నారని చెప్పారు. ఆడపిల్లలను విద్యకు దూరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్ విగ్రహం నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు కవిత విద్యార్థులతో కలిసి కవిత పాదయాత్ర నిర్వహించారు. నడి ఎండలో 3 కి.మీ.లు ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 45 నిమిషాల పాటు ర్యాలీ చేసి కలెక్టరేట్ కు చేరుకున్నారు. తీవ్రమైన ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులతో పాటు కవిత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్ లోకి వెళ్లి కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు గేట్లు మూసి అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులతో పాటు కవిత అక్కడే ఎండలో బైఠాయించారు. విద్యార్థులతో పాటు తమను కలెక్టరేట్ లోకి అనుమతించే వరకు అక్కడ నుంచి కదిలేది లేదంటూ కూర్చున్నారు. కవితతో పాటు విద్యార్థుల అరగంట పాటు ఆందోళన చేయడంతో పోలీసులు దిగివచ్చి విద్యార్థులతో పాటు కలెక్టర్ ను కలిసేందుకు అనుమతించారు.
విద్యార్థులతో కలిసి హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ను కవిత కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫీ రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటంతో జరుగుతున్న నష్టాన్ని కలెక్టర్ కు వివరించారు. విద్యార్థులు కోర్సులు పూర్తి చేసినా కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. అటు ప్రజావాణిలో కూడా ఇదే సమస్యతో విద్యార్థులు వస్తున్నారని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలతో మాట్లాడి వారికి సర్టిఫికెట్స్ ఇప్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఏళ్లకేళ్లుగా ఫీజు బకాయిలు చెల్లించక పోవడంతో యాజమాన్యాలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయని.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలని కలెక్టర్ ను కవిత కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రిప్రజంటేషన్ ను ఉన్నతాధికారులకు పంపి సమస్య పరిష్కరించేలా ప్రయత్నిస్తానని చెప్పారు.
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో అన్ని డివిజన్ల నుంచి పోటీలో ఉంటామని కవిత చెప్పారు. ఇక్కడ నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభిస్తామన్నారు. హన్మకొండ జిల్లా తరాలపల్లిలో పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు. అంతకుముందు తరాలపల్లిలో పార్టీ శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయాలన్న గట్టి సంకల్పంతో కొత్త పార్టీ పెట్టానని చెప్పారు. మెరుగైన విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందాలన్నదే తన లక్ష్యమని అన్నారు. సామాజిక న్యాయంతో పాటు ప్రజలకు మంచి జరగాలన్న తమ సంకల్పానికి ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. అదే విధంగా పార్టీ నాయకులంతా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండి వారికి తరఫున పోరాటం చేయాలని సూచించారు.
విగ్రహ ప్రతిష్టాపన పూజలో పాల్గొన్న కవిత
అనంతరం తరాలపల్లిలోని పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన పూజల్లో కవిత పాల్గొన్నారు. అమ్మవారికి నూతన వస్త్రాలు అందజేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు కవిత గారికి ఆశీర్వచనాలు అందజేశారు. పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కవిత అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ వద్ద మహిళా శాసన సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమని కవిత అన్నారు. సీనియర్ మహిళా ఎమ్మెల్యేల గొంతు పట్టి నెట్టేయడం, చీరలు లాగడం, బూటు కాళ్లతో తొక్కి హింసించడం దారుణమని “ఎక్స్” వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా శాసన సభ్యులకే ఈ రాష్ట్రంలో భద్రత లేదంటే సామాన్య మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలపై హింస, దాడులు పెరుగుతున్నాయని… ప్రస్తుత డీజీపీ బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మరింత దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడులకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.








