తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన సందర్భంగా ఇచ్చిన హామీల అమలకు నిరసనగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు నల్ల టీ షర్టులు ధరించారు అసెంబ్లీకి వచ్చారు. అయితే సభ్యులు ప్లకార్డులు, నినాదాలతో రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు-బీఆర్ఎస్ సభ్యులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. సభ ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేటు వద్ద పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన సందర్భంగా ఇచ్చిన హామీల అమలకు నిరసనగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు నల్ల టీ షర్టులు ధరించారు అసెంబ్లీకి వచ్చారు. ఆ షర్టులపై నినాదాలు రాసి ఉన్నాయి.
దానికితోడు సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో అసెంబ్లీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు-బీఆర్ఎస్ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత తోపులాట జరిగింది. ఫలితంగా పలువురు సభ్యులు రోడ్డుపై పడిపోయారు. పలువురికి గాయాలు అయ్యాయి.
పోలీసుల తీరుకు నిరసనగా హరీశ్‌రావు టీషర్ట్ విప్పి బనియన్‌తో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వివేక్ సహా పలువురు ఎమ్మెల్సీలు టీ షర్డులు విప్పి నిరసన తెలిపారు. అసెంబ్లీ గేటు వద్ద హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్ల టీషర్ట్ ధరించి అసెంబ్లీకి రావడంపై అభ్యంతరం చెప్పడాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు.
టీషర్ట్ ధరించి పార్లమెంట్‌కు రాహుల్ వెళ్తే తప్పు లేనప్పుడు నిరసన తెలపడం ఎందుకు తప్పని ప్రశ్నించారు. తమ నిరసనను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కేటీఆర్. పోలీసులు డ్యూటీ చేయాలని అతి చేయకూడదని వ్యాఖ్యానించారు. రెండేళ్లలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసుల వాగ్వాదంలో తన గాయాలను మీడియాకు చూపించారు
అదే సమయంలో అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, తన చీర పట్టుకుని లాగేశారని, బూటు కాళ్లతో తొక్కారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల తీరును మార్చుకోవాలని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద అస్వస్థతకు గురయ్యారు.
తోపులాటలో ఆయన కిందపడిపోయారు. జరుగుతున్న పరిణామాలతో అక్కడున్న పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. రూ.4,000 పింఛన్, మహిళలకు రూ.2,500 సాయం, 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.








