ప్రశాంత్ వర్మ హను-మాన్ వంటి సంచలన విజయం తర్వాత అయన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’. పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘శుక్రాచార్యుడి వార్ క్రై’ పేరుతో విడుదలైన గ్లింప్స్ సినీ ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. పౌరాణిక, ఫాంటసీ అంశాలతో హాలీవుడ్ విజువల్స్ రేంజ్‌లో ఉన్న ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం..
బాలీవుడ్ వర్సటైల్ నటుడు అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో రాక్షస గురువు ‘శుక్రాచార్యుడు’గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇక గ్లింప్స్‌లో ఆయన లుక్, ఇంటెన్స్ చూపులు, రాక్షస స్వభావంతో కూడిన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “అమృత మథనంలో దేవతలతో సమానంగా శ్రమించినా విష్ణువు అమృతాన్ని కేవలం దేవతలకే ఇచ్చాడు.. ఇది ధర్మమా? అధర్మమా?” అంటూ..సమస్త అసుర జాతి అథ: పాతాళానికి తొక్కేసి చతుర్దశ లోకాల ద్వారాలను మూసివేశారు..ఇది ధర్మమా? అధర్మమా.?. చతుర్దశ దినములలో అసుర విజయ ఘోష సమస్త బ్రహ్మాండములకు ప్రతిధ్వనిస్తుంది. ఆపై అసురులకు విముక్తి లభిస్తుంది. అని అక్షయ్ ఖన్నా పలికిన పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమా స్థాయిని విపరీతంగా పెంచేశాయి.
అసురులకు శాశ్వత విముక్తి కల్పించడం కోసం 14 లోకాల ద్వారాలను తెరిచి, ప్రాణాంతకుడైన ‘రక్తబీజుడు’ని మేల్కొలిపి మానవజాతిపైకి యుద్ధానికి పంపే సన్నివేశాలు అత్యంత రోమాంచితంగా సాగాయి. ఇక ధర్మం, అధర్మం మధ్య జరిగే ఈ మహా సంగ్రామం కాన్సెప్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ని మరో విజువల్ లెవెల్‌కి తీసుకెళ్లేలా ఉంది.
గ్లింప్స్ చివర్లో ఒడిలో పసిపాపను లాలిస్తూనే, మరోవైపు ఆయుధాలు చేతబూని ఉగ్రరూపం దాల్చిన ‘మహాకాళి’గా శ్రియా రెడ్డి కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ‘పెద్దమ్మ చూస్తుందిరా!’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వర్డ్స్ రొమాలు నిక్కబొడుచుకునే హై ఇస్తోంది. ఇక శ్రియా రెడ్డి ఇంటెన్స్ నటన, ఆ మైండ్ బ్లోయింగ్ మేకోవర్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ఈ చిత్రంలో భూమి శెట్టి, రోహిత్ సరాఫ్, సముద్రఖని, ఖుష్బూ సుందర్, నాజర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌కి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ పౌరాణిక యాక్షన్ డ్రామాను 2027 జనవరి 8న ఐమాక్స్ 3Dలో ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మొత్తానికి ప్రశాంత్ వర్మ విజన్, పూజా కొల్లూరు టేకింగ్ కలసి ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా కనిపిస్తున్నాయి. అక్షయ్ ఖన్నా భయంకరమైన నటన, శ్రియా రెడ్డి ఉగ్రరూపం చూస్తుంటే ‘మహాకాళి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.








