తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే పంటలు ఎండిపోతున్నాయని, ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వమే సృష్టించిన కరవు అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతులు నీళ్లు, కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని సుమన్ మండిపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలను ఓ పెద్ద డ్రామాగా అభివర్ణించారు. ఉన్న నీటిని ముందుగానే వదిలేసి, ఇప్పుడు బ్యారేజీ నిర్మిస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడానికే అని అన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు పూర్తి వివరాలతో నిన్ననే వివరించారని గుర్తు చేశారు. సమస్యపై స్పందించకుండా మంత్రులు కేవలం హరీశ్ రావు, కేటీఆర్‌లను దూషించడం సరికాదని హితవు పలికారు.
పాలమూరు-రంగారెడ్డి లిఫ్టులను ఆన్ చేసి ఉంటే సంబంధిత జిల్లాలకు నీరందేదని సుమన్ అభిప్రాయపడ్డారు. నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం గతంలోనే స్పష్టం చేసినప్పుడు, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రైతుల సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్, ఎంత ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుంది, అయ్యే ఖర్చు వివరాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కురువ విజయ్ కుమార్, కె. కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.








