‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రపంచస్థాయి విజయం తర్వాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ‘వారణాసి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ రాజమౌళి స్వయంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం కేవలం టైమ్ ట్రావెల్ కథ కాదని, అంతకుమించిన ఒక గొప్ప సాహస యాత్ర అని జక్కన్న స్పష్టం చేశారు.
ఇటీవల ఓ బ్రెజిలియన్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. “మా సినిమా స్కేల్‌ను కేవలం మాటల్లో వర్ణించడం కష్టం. అందుకే గతేడాది ఒక గ్లింప్స్ విడుదల చేశాం. కథను చెప్పకుండా, ప్రేక్షకులు ఎలాంటి ప్రపంచాలను, అనుభూతులను చూడబోతున్నారో తెలియజేయడమే ఆ వీడియో ఉద్దేశం” అని తెలిపారు.
సినిమా కథా నేపథ్యం గురించి ఆయన మరింత లోతుగా వివరించారు. “దీనిని కేవలం టైమ్ ట్రావెల్ కథగా చూడవద్దు. ఈ సినిమా వేర్వేరు ప్రపంచాల మీదుగా ముందుకు సాగే ఒక అడ్వెంచర్. అంటార్కిటికా నుంచి ఆఫ్రికాకు, అక్కడి నుంచి వారణాసి నగరానికి ప్రయాణిస్తుంది. అంతేకాదు, ఇది వేర్వేరు యుగాల్లోకి కూడా ప్రయాణిస్తుంది. పురాణ యుగంలోకి కూడా వెళ్తాం. అక్కడ మీరు భారీ రూపంలో ఉండే జీవులను, దేవుళ్లను, అలాంటి ఎన్నో అంశాలను చూస్తారు” అని రాజమౌళి వివరించారు.
అయితే ఇంతటి భారీ హంగుల వెనుక ఉన్న అసలు కథ తండ్రీకొడుకుల మధ్య ఉండే భావోద్వేగమేనని ఆయన నొక్కి చెప్పారు. “ఈ మొత్తం సాహస యాత్రకు తండ్రీకొడుకుల మధ్య ఉండే బలమైన ప్రేమ, వారి మధ్య ఉన్న బంధమే చోదక శక్తి. ఆ భావోద్వేగాలే ఈ మొత్తం కథను ముందుకు నడిపిస్తాయి” అని జక్కన్న స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనుండగా, నాయిక ‘మందాకిని’ పాత్రలో ప్రియాంక చోప్రా జోనాస్, ప్రతినాయకుడు ‘కుంభ’గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. తాజాగా రాజమౌళి వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.









