గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింట్లో ఒక సీటును కచ్చితంగా గెలవాలని గట్టి ప్రయత్నం మీదున్న బీజేపీకి.. జనసేనతో పొత్తు అంశం పంటికింద రాయిలా మారింది. ఎన్డీయేలో భాగంగా ఉన్న జనసేన పార్టీతో పొత్తులు, పవన్‌తో ఎన్నికల ప్రచారాలకు సంబంధించి ఓ వ్యూహంతో ముందుకు పోవాలని తెలంగాణ బీజేపీ భావించింది. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం రోజునే పనిగట్టుకుని మరీ ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ అని పేరుతో పవన్ రచ్చ రచ్చ చేశారని అనుకుంటున్నారు. ఇది చాలదంటూ మమ్మల్ని అడుగు పెట్టనీయరా…? ఎవడబ్బ జాగీరు తెలంగాణ..? అని రెచ్చగొట్టే కామెంట్ చేసి మళ్లీ ఇక్కడ తెలంగాణవాదాన్ని తట్టిలేపారు పవన్.
ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం వేసుకున్న ప్రణాళికలకు తూట్లు పడినట్టయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ పట్ల ఇక్కడ యువతలో ఉన్న అభిమానాన్ని పార్టీ ఎదుగుదలకు, అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగించుకోవాలనే ప్లానింగ్ చేశారు. కానీ పవన్ తన వీరావేశంతో అంతా చెడగొట్టి కూర్చున్నారనే కామెంట్స్ తెలంగాణ బీజేపీ నుంచి వినిపిస్తున్నది. అందుకే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనతో పొత్తుగానీ, మిత్రధర్మాన్ని అనుసరించి.. కనీసం ప్రచారం చేయించుకునే అంశాన్ని గానీ పరిగణలోకి తీసుకోవద్దని సూచించినట్టు తెలుస్తోంది.
తాజాగా తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్‌తో జరిగిన తెలంగాణ నేతల భేటీలో ఈ విషయం కీలకంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మెజారిటీ నేతలంతా పవన్‌తో పొత్తు, ప్రచారం అంతా బీజేపీని చెడగొట్టే వ్యవహారమే తప్ప మరోటి కాదని తేల్చేశారట. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆ పార్టీ చీఫ్ రాంచంద్రరావు పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నది. నల్లగొండ- వరంగల్- ఖమ్మం నియోజకర్గం నుంచి ఇంకా పేరు ఖరారు కాలేదు. కానీ గ్రేటర్ ఎమ్మెల్సీపైనే బన్సల్ ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నుంచి నల్లగొండ-ఖమ్మం- వరంగల్ నుంచి గడల శ్రీనివాసరావును బరిలోకి దింపారు పవన్. తెలంగాణకు మేమే ఆల్టర్నేట్ అనే ధీమాతో ఉన్న బీజేపీకి.. పవన్‌ను చేరదీయడమంటే చంకలో పిల్లిని పెట్టుకుని ప్రయాణం చేసినట్టేనని ఇక్కడి బీజేపీ నేతలు భావిస్తున్నారు.







