AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ.. రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్..

పీవీ సింధు.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్ధులను చిత్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత జెండాను రెపరెపలాడించిన ఈమె.. ఇప్పుడు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా దర్శక ధీరుడు తనపై కురిపించిన ప్రశంసలకు ప్రత్యుత్తరంగా ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు అభిమానులలో కొత్త అనుమానాలు కూడా క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

 

పీవీ సింధు పై రాజమౌళి ప్రశంసలు..

ఇటీవల జపాన్ ఓపెన్ టోర్నమెంట్ లో అద్భుతమైన ప్రదర్శనతో టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధుని.. ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి అభినందిస్తూ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచిన పీవీ సింధుకి శుభాకాంక్షలు. వాటే ఛాంపియన్ కం బ్యాక్, నిన్ను చూసి భారతదేశం గర్విస్తోంది” అంటూ పీవీ సింధు పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు.

 

మీ సినిమాలో ఒక్క ఛాన్స్ పీవీ సింధు..

అయితే పీవీ సింధు మాత్రం ఈ ట్వీట్ కి అదే స్థాయిలో సరదాగా స్పందించింది..” ధన్యవాదాలు రాజమౌళి సార్.. మీ వారణాసి సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ మీ సినిమాలో ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర అవసరమైతే.. ఒకవేళ కొత్త హీరోయిన్గా నటించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.” అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ఆమె ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం పీవీ సింధు చేసిన ఈ ట్వీట్ ను నెటిజన్స్ భారీగా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

 

నిజమైతే రాజమౌళి నెక్స్ట్ మూవీ లో ఛాన్స్..

అంతేకాదు పీవీ సింధు చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్స్ కాస్త ఒక అడుగు ముందుకేసి .. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన తన తదుపరి చిత్రాన్ని సూర్యతో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా.. బహుశా సింధు కూడా హీరోయిన్ గా చేయడానికి ఆసక్తి కనబరిస్తున్న నేపథ్యంలో ఆమెకు అవకాశం కల్పిస్తారేమో అంటూ తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే బ్యాట్ చేత పట్టి ప్రత్యర్ధులను దడదడలాడించిన పీవీ సింధు నటిగా తన విశ్వరూపం చూపిస్తుందేమో చూడాలి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇది నిజమై ఎప్పుడైనా ఈ కాంబో తెరపైకి వస్తుందా? లేక అభిమానులను అలరించిన సోషల్ మీడియా మూమెంట్ గానే మిగిలిపోతుందా అన్నది చూడాలి.

 

వారణాసి మూవీ విశేషాలు..

రాజమౌళి విషయానికి వస్తే.. ప్రస్తుతం వారణాసి సినిమాతో వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ .1200 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రం అంటార్కిటిక్ , వారణాసి, ఆఫ్రికన్ అడవుల వంటి విభిన్న నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు అటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయని చెప్పవచ్చు.

ANN TOP 10