తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ కేసులో ఏపీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. 2023లో వెంకటేశ్వరరావు కాల్ డేటా రికార్డింగ్స్ ను నిందితులు సేకరించినట్టు సిట్ గుర్తించింది. దీంతో, సాక్షిగా ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
గత ఐదున్నర నెలలుగా అహర్నిశలు సాగిన దర్యాప్తులో సిట్ సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు పోలీసు మాజీ అధికారులు, రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో తుది చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిట్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ కేసు నిందితుల జాబితాలో ముగ్గురు బీఆర్‌ఎస్ ముఖ్యుల్ని చేర్చినట్లు గతంలో ప్రచారం జరిగింది. పక్క రాష్ట్రానికి చెందిన బ్యూరోక్రాట్‌ను సిట్ విచారించడం ఇదే మొదటిసారి. ఈ కేసు దర్యాప్తు ముగింపునకు చేరుకుంటున్నట్లు సమాచారం. అనుబంధ అభియోగ పత్రం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.








