తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ అయి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను వివరించారు.
సురేఖ వివరించిన అంశాలను ఓపికగా విన్న మీనాక్షి నటరాజన్ సంయమనం పాటించాలని సూచించారు. చిన్నచిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. ఈ వివాదంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి కడియంపై సురేఖ ఫిర్యాదు చేశారు.








