AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రకాశం జిల్లాలో క్షుద్రపూజలకు ఐదేళ్ల చిన్నారి బలి..!

వైద్య రంగం ఎంతో ముందుకు దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా.. ఇంకా మూఢనమ్మకాలు అమాయక ప్రాణాలను బలిగొంటూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఒక అత్యంత దారుణమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నడవలేని స్థితిలో ఉన్న ఒక ఐదేళ్ల అమాయక బాలుడికి నయం చేస్తానంటూ, చికిత్స పేరుతో ఒక మహిళ నమ్మించి గొంతుకోసింది. కళ్ల ముందే కన్నబిడ్డ నరకయాతన పడుతున్నా, ఆ వికృత పూజల వెనుక ఉన్న మోసాన్ని తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు. చివరికి ఆ రాక్షసత్వానికి ఒక పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది.

 

నడిపిస్తానని నమ్మించి.. నరకం చూపించి!

బాధిత కుటుంబంలో ఐదేళ్ల చిన్నారి చక్రవర్తి పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్నాడు. బిడ్డ ఎలాగైనా సాధారణ స్థితికి వచ్చి, అందరిలా నడవాలన్నదే ఆ తల్లిదండ్రుల ఆరాటం. ఇదే వారి బలహీనతగా మార్చుకుంది మొబీనా అనే మహిళ. ఆ చిన్నారిని తాను తిరిగి నడిచేలా చేస్తానని, తన దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయని ఆ కుటుంబానికి మాయమాటలు చెప్పి నమ్మించింది. బిడ్డ భవిష్యత్తు బాగుంటుందనే గుడ్డి నమ్మకంతో, ఆ తల్లిదండ్రులు కూడా ఆమె చెప్పిన దారుణమైన కండిషన్లకు ఒప్పుకున్నారు. చికిత్స పేరుతో బాలుడి చేతులను తాళ్లతో కట్టేసి, ఆ పసివాడిపై మొబీనా విచక్షణారహితంగా దాడి చేస్తూ చిత్రహింసలకు గురిచేసింది.

 

దెబ్బలు తాళలేక పసిప్రాణం అనంత వాయువుల్లో..

శరీరం ఇంకా సరిగ్గా పెరగని ఆ ఐదేళ్ల పసివాడు, ఆ రాక్షస మహిళ పెట్టిన టార్చర్‌ను తట్టుకోలేకపోయాడు. ఒంటిపై పడిన బలమైన దెబ్బలకు, ఆ నరకయాతన భరించలేక చిన్నారి చక్రవర్తి అక్కడికక్కడే కన్నుమూశాడు. బిడ్డ చనిపోయాడని తెలియగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అయితే, ఆ రాక్షసి మోసం అక్కడితో ఆగలేదు. చనిపోయిన బాలుడిని తాను మళ్లీ బతికిస్తానంటూ నమ్మబలికింది. ఆ మృతదేహాన్ని ముందే పెట్టుకుని గంటల తరబడి వికృతమైన క్షుద్రపూజలు చేస్తూ నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేసింది.

 

గుట్టురట్టు చేసిన బంధువులు.. పోలీసుల ఎంట్రీ

సమయం గడుస్తున్నా బాలుడిలో ఎలాంటి చలనం లేకపోవడం, పైగా మొబీనా ప్రవర్తన అత్యంత విచిత్రంగా మారడంతో అక్కడ ఉన్న బంధువులకు అసలు విషయంపై అనుమానం వచ్చింది. చికిత్స పేరుతో ఆ చిన్నారిని ఆమె కొట్టి చంపేసిందని గ్రహించిన బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒక్కసారిగా మొబీనాపై దాడి చేసి, ఆ తర్వాత వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గుండెలవిసే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ANN TOP 10