AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రోడ్లపై నమాజ్‌లపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..

రోడ్లపై నమాజ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రోడ్లు అనేవి ప్రజల రాకపోకల కోసం ఉద్దేశించినవని, ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తూ ట్రాఫిక్‌ను దిగ్బంధించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టం, ప్రభుత్వ నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని, ఎవరికైనా సరే ప్రత్యేక మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

 

కొందరు తనను ఉత్తరప్రదేశ్‌లో రోడ్లపై నమాజ్‌ల నియంత్రణ గురించి అడుగుతుంటారని ప్రస్తావిస్తూ, యూపీలో అలాంటి వాటికి తావులేదని ఆయన కుండబద్దలు కొట్టారు. మసీదులలో స్థలం సరిపోని పక్షంలో, జనాభాకు తగ్గట్టుగా షిఫ్టుల పద్ధతిలో నమాజ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఇళ్లతో పాటు ప్రార్థనా స్థలాలలో స్థలాభావం ఉంటే, దానికి తగ్గట్టుగా నియంత్రించుకోవాలే తప్ప రోడ్లను ఆక్రమించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో కూడా పంచుకున్నారు.

 

ఈ అంశం కేవలం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాకుండా… పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తోంది. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా యోగి ఆదిత్యనాథ్ ఇవే వ్యాఖ్యలను పునరావృతం చేశారు. అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం రోడ్లపై నమాజ్‌లను అనుమతించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అయితే, యోగి ఆరోపణలను టీఎంసీ వర్గాలు పూర్తిగా తోసిపుచ్చాయి. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే యోగి ఆదిత్యనాథ్ మైనారిటీలను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.

ANN TOP 10