భవిష్యత్ అణు ఇంధన (న్యూక్లియర్ ఎనర్జీ) ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన ప్రపంచ భాగస్వామిగా నిలబెట్టడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఇది అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఐ), యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (యూఎస్ఐఎస్ పీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన “యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా” సదస్సులో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సహజసిద్ధ ప్రయోజనాలు
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, “ఆధునిక న్యూక్లియర్ సాంకేతికతలైన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం రియాక్టర్ సిస్టమ్స్‌కు విస్తృత అవకాశాలున్నాయి. భారత్‌లో ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ రంగంలో నైపుణ్యం, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తి వంటివి కలిసొచ్చే అంశాలు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పారిశ్రామిక మౌలిక వసతులు, పోర్టులు, లాజిస్టిక్స్, వేగవంతమైన అమలు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది భారతదేశానికి, ఏపీకి ఒక చరిత్రాత్మక అవకాశం” అని వివరించారు.
రాష్ట్రానికి ఉన్న సువిశాల తీరప్రాంతం, శక్తివంతమైన పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పారిశ్రామిక కారిడార్లు, ప్రతిష్టాత్మక పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ వంటివి అదనపు ప్రయోజనాలని తెలిపారు. పారిశ్రామికీకరణలో వేగం, అమలు అత్యంత ముఖ్యమని, ఇందులో న్యూక్లియర్ ఎకోసిస్టమ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
ఎనర్జీ సెక్యూరిటీ మాకు అత్యంత కీలకం
ప్రపంచ దేశాలు ఆర్థికవృద్ధి, పారిశ్రామిక వ్యాప్తి, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటివి ఏకకాలంలో ఎలా సాధించాలని ఆలోచిస్తున్నాయని లోకేష్ అన్నారు. వాతావరణ మార్పులపై ఇచ్చిన హామీలను పాటిస్తూ, ఏఐ యుగానికి అవసరమైన విద్యుత్‌ను తక్కువ ఖర్చుతో, సురక్షితంగా ఎలా అందించాలన్నది పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాంక్షలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఇంధన భద్రత (ఎనర్జీ సెక్యూరిటీ) మాకు అత్యంత ప్రాధాన్య అంశం. నేడు ఏపీ దేశంలోనే కీలకమైన పారిశ్రామిక, డిజిటల్ కేంద్రంగా మారుతోంది,” అని లోకేష్ స్పష్టం చేశారు.
ఇంధన పరివర్తనపై ఆంధ్రప్రదేశ్ దృష్టి
రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నామని, ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నామని లోకేష్ తెలిపారు. విశాఖపట్నాన్ని ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, అక్కడ 6 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు రాబోతున్నాయని వెల్లడించారు.
భవిష్యత్ పరిశ్రమలకు భారీ పరిమాణంలో, 24/7 నిరంతరాయంగా, కాలుష్యరహిత, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ అవసరమని, అందుకే ఇంధన ప్రణాళిక ఆర్థిక ప్రణాళికలో కీలకంగా మారిందని వివరించారు. “మా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రెన్యూవబుల్స్, స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్, గ్రిడ్ ఆధునీకరణ వంటి రంగాల్లో సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నాం,” అని ఆయన ప్రకటించారు.
భవిష్యత్తులో భారీగా విద్యుత్ అవసరం
భవిష్యత్ పారిశ్రామిక వృద్ధికి కేవలం పునరుత్పాదక శక్తి సరిపోదని తాము వాస్తవికంగా ఆలోచిస్తున్నామని లోకేష్ అన్నారు. ఏఐ కంప్యూటింగ్ విస్తరిస్తున్న కొద్దీ విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని, ఒక హైపర్‌స్కేల్ ఏఐ-నేటివ్ డేటా సెంటర్ ఒక మధ్యస్థ పట్టణానికి సమానమైన విద్యుత్‌ను వినియోగిస్తుందని ఉదహరించారు. గ్లోబల్ కంపెనీలు విశాఖలో గిగావాట్ సామర్థ్యంగల ఏఐ-నేటివ్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని, వీటికి భారీ విద్యుత్ అవసరమవుతుందని తెలిపారు.
డేటాసెంటర్ల చుట్టూ తయారీ ఎకోసిస్టమ్
తమ దృష్టిలో డేటా సెంటర్ అంటే కేవలం సర్వర్లతో కూడిన భవనాలకు ఆతిథ్యమివ్వడం కాదని, దాని చుట్టూ ఒక పూర్తిస్థాయి తయారీ ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. కూలింగ్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, బ్యాటరీ స్టోరేజ్ వంటి వాటిని స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఏఐ టెక్నీషియన్లు, ఎనర్జీ ఇంజనీర్ల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి సంస్థలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
న్యూక్లియర్ ఎనర్జీ సప్లయ్ చైన్‌లో భాగస్వామ్యం
న్యూక్లియర్ ఎనర్జీని కూడా ఒక పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థగా చూడాలని లోకేష్ అభిప్రాయపడ్డారు. కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, పూర్తి న్యూక్లియర్ వాల్యూ చైన్‌లో భాగస్వామ్యం కావడమే ఏపీకి దీర్ఘకాలిక అవకాశమని అన్నారు. కీలక విడిభాగాలు తయారు చేయడం, అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలు నిర్మించడం, ప్రపంచస్థాయి భద్రతా ప్రమాణాలు నెలకొల్పడం, భవిష్యత్ వర్క్‌ఫోర్స్‌కు శిక్షణ ఇవ్వడం వంటి వాటిపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.
ఎకో సిస్టమ్ నిర్మాణానికి సరైన సమయం
న్యూక్లియర్ ప్రాజెక్టులకు బదులుగా న్యూక్లియర్ పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను నిర్మించడానికి ఇదే సరైన సమయమని లోకేష్ పేర్కొన్నారు. అణుశక్తి విశ్వసనీయ బేస్‌లోడ్ విద్యుత్‌ను అందిస్తుందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, దీర్ఘకాలంలో పోటీ ధరలకు విద్యుత్‌ను అందిస్తుందని వివరించారు. ఆధునిక న్యూక్లియర్ టెక్నాలజీల వల్ల భద్రతా ప్రమాణాలు కూడా గణనీయంగా మెరుగుపడ్డాయని గుర్తుచేశారు.
ఇంధన భవిష్యత్ పైనే ఏఐ భవిష్యత్
ఏఐ విప్లవం వల్ల ఇంధనానికి డిమాండ్ పెరిగిందని, దీనివల్ల న్యూక్లియర్ ఎనర్జీ ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని లోకేష్ అన్నారు. “ఏఐ భవిష్యత్తు ఇంధన భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో నమ్మకమైన, స్వచ్ఛమైన బేస్‌లోడ్ విద్యుత్ తప్పనిసరి. ఇది ప్రభుత్వాలు, టెక్నాలజీ ప్రొవైడర్లు, పెట్టుబడిదారుల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలకు అపారమైన అవకాశాలు సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆ భవిష్యత్తులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటోంది,” అని ఆయన తెలిపారు.
యూఎస్-ఇండియా న్యూక్లియర్ అధ్యాయం
భారత్-అమెరికా సహకారం ఇప్పటికే టెక్నాలజీ, రక్షణ, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో మార్పులు తెచ్చిందని, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో తదుపరి ప్రధాన అధ్యాయం అణుశక్తి రంగమే కాగలదని లోకేష్ బలమైన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఇంధన భాగస్వామ్యంగా కాకుండా, పారిశ్రామిక, తయారీ, ఆవిష్కరణల భాగస్వామ్యంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పటిష్ఠమైన ఇంధన, పారిశ్రామిక పునాదులు నిర్మిస్తున్నామని, దీర్ఘకాలిక దార్శనికత కలిగిన గ్లోబల్ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ తన ప్రసంగాన్ని ముగించారు.







