వాషింగ్టన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం రేగగా, మరోవైపు కొందరు చేసిన పని తీవ్ర వివాదాస్పదమైంది. ప్రాణభయంతో పరుగులు తీయాల్సిన సమయంలో, కొందరు టేబుళ్లపై ఉన్న ఖరీదైన వైన్ బాటిళ్లను చేతుల్లో పట్టుకుని బయటకు వెళ్లడం కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో జర్నలిస్టుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో ఈ వార్షిక విందు జరిగింది. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ, ఉన్నతాధికారులు, జర్నలిస్టులు, ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా బాల్‌రూమ్ సమీపంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రంప్ దంపతులను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. అతిథులంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ గందరగోళం మధ్యే కొందరు అతిథులు, టేబుళ్లపై ఉన్న వైన్, షాంపేన్ బాటిళ్లను తీసుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. “విపత్తులో అవకాశాన్ని వెతుక్కున్నారు” అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వివాదానికి ‘వైన్-గేట్’ అని పేరు పెట్టారు.
కాల్పులకు పాల్పడిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ థామస్ అలెన్ (31)గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద షాట్‌గన్, హ్యాండ్‌గన్‌తో పాటు పలు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ట్రంప్ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ అధికారి ఒకరికి బుల్లెట్ తగిలినప్పటికీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండడంతో అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిందితుడిపై ఫెడరల్ చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







