AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు.. నిందితుల ఇళ్లలో ఈడీ..

ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైందా? ఈడీ దూకుడుగా వెళ్తోందా? శుక్రవారం నిందితుల ఇళ్లలో సోదాలు ముమ్మరం చేసిందా? కేసు ముగిసిందని భావించిన తరుణంలో ఈడీ సోదాలతో వైసీపీ నేతల్లో కలకలం మొదలైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు

 

ఏపీలో లిక్కర్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఒకరి తర్వాత మరొకరు ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులోభాగంగా తొలుత ఐటీ రంగంలోకి దిగింది. నిందితులకు సంబంధించి, వారికి సహకరించిన బంగారు యజమానుల ఇళ్లలో సోదాలు చేసింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

 

తాజాగా ఇప్పుడు ఈడీ వంతైంది. ఈ కేసులో కీలక నిందితుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు సోదాలు తీవ్రం చేశారు. కీలక నిందితులు రాజ్ కసిరెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, భారతీ సిమెంట్‌ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు.

 

నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు, వైసీపీలో కొత్త టెన్షన్

 

హైదరాబాద్, తిరుపతితోపాటు మరికొన్ని ప్రాంతాల్లోని నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. వీరంతా మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ ఇప్పటికే నిర్ధారించింది. వీరిలో చాలామంది అరెస్ట్ కాగా, కొంతమంది బెయిల్‌పై ఉన్నారు. సిట్ నివేదిక ఆధారంగా ఈడీ వంతైంది.

 

ఈ కేసులో సిట్ ఇంకా విచారణ జరుపుతోంది. నిందితులకు సంబంధించిన ఆస్తులను జప్తుకు న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుంది. అక్రమంగా వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించినట్టు తేల్చింది. మళ్లీ అక్కడి నుంచి వైట్ రూపంలో నిధులు తిరిగి తీసుకొచ్చినట్టు గుర్తించారు.

 

దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను సిట్ సేకరించింది. మరొక నిందితుడు అనిల్ చోక్రా.. షెల్ కంపెనీలను మేనేజ్ చేసినట్టు సిట్ నిర్ధారించింది. సుమారు 25 కంపెనీలను ఆయనొక్కడే చూస్తున్నట్లు సిట్ అంతర్గత సమాచారం. ఉన్నట్లుండి ఈడీ సోదాలు చేస్తుండడంతో కొందరు వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. దాదాపు చివరి అంకానికి చేరుకున్న ఈ కేసులో ఈడీ రంగ ప్రవేశంతో ఏం జరుగుతుందోనని అంటున్నారు. ఈడీ సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది

ANN TOP 10