AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాళ్ళ ఆశీస్సులు జగన్‌కే.. 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఖాయం..!

విశాఖపట్నం రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మత్స్యకార వర్గాల ప్రయోజనాల విషయంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల తీరును పోలుస్తూ ఆయన సంచలన విమర్శలు చేశారు. చంద్రబాబుకు మత్స్యకారులంటే గౌరవం లేదని, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి తీరా అధికారం వచ్చాక విస్మరించడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.

 

గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేస్తూ.. ‘మత్స్యకారుల తోలు తీస్తా’ అని బాబు హెచ్చరించిన తీరును వాసుపల్లి తీవ్రంగా ఖండించారు. గంగవరం జెట్టీ విషయంలో మత్స్యకారులను మోసం చేశారని, కనీసం ఒక్క జెట్టీ కూడా కట్టని చరిత్ర బాబుదని విమర్శించారు. చంద్రబాబు నమ్మి మోసపోయిన వర్గాల్లో మత్స్యకారులు ముందు వరుసలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

మరోవైపు, వైఎస్ జగన్ పాలనలో మత్స్యకారులకు జరిగిన మేలును ఆయన కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారని, కరోనా వంటి కష్టకాలంలో కూడా జువ్వలదిన్నెలో అద్భుతమైన హార్బర్‌ను నిర్మించి చూపారని ప్రశంసించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి గతంలో చంద్రబాబు 15 కోట్ల గ్రాంట్ ఇవ్వడానికి నిరాకరిస్తే, జగన్ ఏకంగా 150 కోట్లు కేటాయించి హార్బర్‌ రూపురేఖలు మార్చారని గుర్తుచేశారు.

 

ముఖ్యంగా విశాఖ హార్బర్‌లో బోట్లు అగ్నిప్రమాదానికి గురైనప్పుడు, జగన్ గంటల వ్యవధిలోనే స్పందించి బాధితులకు పరిహారం అందించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని వాసుపల్లి పేర్కొన్నారు. లోకేష్ వ్యవహారశైలి చంద్రబాబు రాజకీయ పతనానికి కారణమవుతుందని వ్యాఖ్యానిస్తూ.. 2029లో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, మత్స్యకార వర్గాలన్నీ వైఎస్సార్సీపీ వెంటే ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ANN TOP 10