చెన్నై ఫ్యాన్స్‌కు చేదు వార్త చెప్పిన హెడ్ కోచ్!
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతి వరకూ విజయం కోసం పోరాడిన చెన్నై సూపర్ కింగ్స్ మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వాస్తవానికి ధోనీ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి చెన్నై విజయానికి 35 బంతుల్లో 73 పరుగులు అవసరం కాగా.. చేతిలో 5 వికెట్లే ఉన్నాయి. దీంతో ఆరంభంలో మెల్లగా ఆడిన ధోనీ.. చివరి ఓవర్లలో ఫోర్లు, సిక్సులతో విరుచుకపడ్డాడు. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 17 బంతుల్లో 32 పరుగులు చేసినప్పటికీ.. ఆఖరి బంతికి సిక్స్ బాదలేకపోవడంతో సొంత గడ్డ మీద సీఎస్కే ఓటమిపాలైంది.
ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. సందీప్ శర్మ తొలి రెండు బంతులను వైడ్ వేయగా.. ధోనీ వరుసగా రెండు సిక్సులు బాదడంతో చెన్నై విజయానికి 3 బంతుల్లో 7 పరుగులు అవసరం అయ్యాయి. మిడ్ వికెట్ దిశగా బంతిని బాదిన ధోనీ.. రెండు పరుగులు తీసే వీలున్నప్పటికీ సింగిల్‌తో సరిపెట్టాడు. దీంతో ధోనీ ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తాయి. చివరి రెండు బంతులకు కూడా సింగిల్సే రావడంతో రాజస్థాన్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది.
అంతకు ముందు ఆడమ్ జంపా వేసిన 18వ ఓవర్లోనూ రవీంద్ర జడేజా ప్యాడ్‌కు బంతి తగలగా… డబుల్ తీసే వీలున్నప్పటికీ ధోనీ సింగిల్‌తో సరిపెట్టాడు. జేసన్ హోల్డర్ వేసిన 19వ ఓవర్లో యార్కర్‌ను లాంగాన్ దిశగా ఆడిన మహీ.. రెండు పరుగులు తీసే అవకాశం ఉన్నప్పటికీ మోకాలి గాయం కారణంగా సింగిల్ తీసి ఆగిపోయాడు.