అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై కఠినమైన నావికాదళ దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నామని, తెలివిగా నిర్ణయం తీసుకోవాలని గురువారం అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే సైనిక చర్యను మరింత తీవ్రతరం చేయడానికి తమ బలగాలు ‘లాక్ అండ్ లోడ్’తో సిద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, ఎయిర్ ఫోర్స్ జనరల్ డాన్ కెయిన్, యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్లీ కూపర్ కూడా పాల్గొన్నారు.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’గా పిలుస్తున్న సైనిక చర్య తర్వాత ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఈ హెచ్చరికలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతంపై దిగ్బంధనం ఇప్పటికే అమల్లో ఉందని, దీన్ని నిరవధికంగా కొనసాగించగలమని హెగ్సెత్ తెలిపారు. “మీ ఇంధనం కదలడం లేదు, ఇకపై కదలదు కూడా. ఇది మర్యాదపూర్వకంగా జరిగే విధానం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఏ దేశానికి చెందిన నౌక అయినా ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించకుండా ఈ దిగ్బంధనం వర్తిస్తుందని, ఇప్పటికే 13 నౌకలను వెనక్కి పంపినట్లు అధికారులు వెల్లడించారు.
దౌత్యపరమైన పరిష్కారాన్నే తాము కోరుకుంటున్నామని, కానీ చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెగ్సెత్ హెచ్చరించారు. “మేం మంచి మార్గాన్నే ఇష్టపడతాం… కానీ మీరు చెడు మార్గాన్ని ఎంచుకుంటే, మీ ఇంధన పరిశ్రమతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాలే మా లక్ష్యం. మా అధ్యక్షుడి ఆదేశాలతో, ఒక్క బటన్ నొక్కితే చాలు.. మేము దాడికి సిద్ధం” అని ఆయన స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, తమ సైన్యం పూర్తి సంసిద్ధతతో ఉందని, క్షణాల్లో భారీ సైనిక చర్యలను పునఃప్రారంభించగలమని జనరల్ కెయిన్ అన్నారు.
ఈ విరామ సమయాన్ని ఆయుధాలు సమకూర్చుకోవడానికి, వ్యూహాలను సర్దుబాటు చేసుకోవడానికి వినియోగించుకుంటున్నామని అడ్మిరల్ కూపర్ తెలిపారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి ప్రాంతీయ భాగస్వాములు తమకు ‘అసాధారణ సహచరులు’గా అండగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి ఆపరేషన్లలో ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వారి కమ్యూనికేషన్ వ్యవస్థ మునుపెన్నడూ లేనంత బలహీనంగా మారిందని హెగ్సెత్ పేర్కొన్నారు.
మరోవైపు, గల్ఫ్ దేశాల నుంచి ఇంధన సరఫరాలపై ఆధారపడిన భారత్, ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఈ సంక్లిష్టమైన జలాల్లో దిగ్బంధనాన్ని అమలు చేయడం “సూపర్‌మార్కెట్ పార్కింగ్ లాట్‌లో స్పోర్ట్స్ కార్ నడపడం లాంటిది” అని జనరల్ కెయిన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.








