AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డీ లిమిటేషన్ తర్వాత తెలంగాణలో సుమారు 40 సీట్లు..?

డీ లిమిటేషన్ తర్వాత తెలంగాణలో సుమారు 40 సీట్లు ఎక్స్ క్లూజీవ్ గా మహిళలకే లభిస్తాయనే చర్చ మొదలు కాగానే, ‘అధ్యక్షా ’అనాలని భావిస్తున్న మహిళలు ఇప్పటినుంచే నియోజకవర్గాలను సెలక్ట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రైవేట్ సంస్థలు ద్వారా జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాలను స్వతహాగా డివైడ్ చేసుకోని వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా పలు నియోజకవర్గాల్లో సర్వేలు కూడా చేపించుకుంటున్నారు. ఆయా సర్వేలకు అనుబంధంగా ఇటీవల తెలంగాణలో పూర్తి చేసిన క్యాస్ట్ సెన్సెస్ లెక్కలను ఆధారంగా తీసుకొని సెగ్మెంట్లు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఆయా సెగ్మెంట్లలో క్షేత్రస్థాయిలో వర్క్ చేయవచ్చని మహిళా నేతలు భావిస్తున్నారు. అందరి కంటే ముందు అధికార పార్టీ లీడర్లు ఈ ప్రాసెస్ ను ఎంచుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్, జిల్లాలు ఇలా వేర్వేరుగా సర్వేలు నిర్వహిస్తూ సెగ్మెంట్ల బోర్డర్లను ఫిక్స్ చేస్తున్నారు. తద్వారా ఆయా నియోజకవర్గాల్లో ప్రజల కోసం పనిచేయడం ఈజీగా ఉంటుందని మహిళా లీడర్లు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటివరకూ పార్టీల అధిష్టానాలు ఇచ్చే ‘బి-ఫామ్’ కోసం క్యూ కట్టిన మహిళా నేతలు, ఇప్పుడు రూటు మార్చారు. తమ విజయానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్రం ప్రకటన కోసం వెయిట్ చేయకుండా.. క్షేత్రస్థాయిలో తమ బలాన్ని అంచనా వేసుకునేందుకు ప్రైవేట్ సర్వేల ద్వారా జనాభా ప్రాతిపదికన, కుల గణనను ప్రామాణికంగా తీసుకుని కొత్త నియోజకవర్గాల ఎంపికకు పదును పెడుతున్నారు.

 

సానుకూలత, ప్రతికూలతపై కూడా..

ఈ సర్వేల ద్వారా మహిళా ఓటర్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు? అక్కడ వర్క్ చేస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుంది? ఏ సెగ్మెంట్ బాగుంటుంది? అనే తదితర అంశాలపై కూడా ప్రైవేట్ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇప్పట్నుంచే నియోజకవర్గ స్థాయిలో పనిచేసుకుంటూ వెళితే తమకు పార్టీలు టిక్కెట్లు కేటాయిస్తాయని మహిళా నేతలు ఫీలవుతున్నారు. అందరి కంటే ముందు రేసులో కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్లు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఎన్నికలకు మరి కొంత సమయం ఉన్న నేపథ్యంలో ప్రజల్లో మమేకమైతే మైలేజ్ వస్తుందని మహిళా నేతలు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా యువత, మహిళలు, వృద్ధులను ఆకర్షిస్తూ కొందరు మహిళా నేతలు నియోజకవర్గ స్థాయిలలో తిరుగుతూనే ఉన్నారు. 2029 లో జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని కంకణం కట్టుకొని మరీ వర్క్ చేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్ తో పాటు యూత్ కాంగ్రెస్, స్పోక్స్ పర్సన్లు ఆ 40 సీట్లలో తమ పేరు పొందాలని సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.

 

బిల్లు అమల్లోకి రాకముందే అలర్ట్..

మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావడానికి ముందే మహిళలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం పొలిటికల్ పార్టీల పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భర్త పేరుతోనో, తండ్రి వారసత్వంతోనో రాజకీయాల్లో వస్తున్న మహిళలే అత్యధికంగా కనిపించే వారు. కానీ ఇప్పుడు రిజర్వేషన్ అమలు కానున్నదనే ధైర్యంతో సొంతంగా క్షేత్రస్థాయిలో ఫైట్ చేసేందుకు గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తున్నారు. ఇందుకోసమే స్పష్టమైన డేటా కోసం సర్వేల ద్వారా తమ భవితత్వాన్ని చెక్ చేసుకుంటున్నారు. కొందరు మహిళా నేతలు తమకంటూ ఒక ప్రత్యేక ఐటీ సెల్‌ను, సోషల్ మీడియా బృందాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం ప్రజల్లో ఉండేందుకు వ్యూహ రచన చేస్తున్నారు.

ANN TOP 10