AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని నిర్మాణం, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చి నాలుగోసారి మోసపోయారని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు.

 

రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణను విస్మరించి, కేవలం అమరావతిపైనే లక్షల కోట్లు కుమ్మరించడం వల్ల ఉత్తరాంధ్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అమరావతి నగరం ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదని, అది భవిష్యత్తులో జన సంచారం లేని “ఘోస్ట్ క్యాపిటల్” (నిర్జన నగరం)గా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా మలేషియాలోని ‘పుత్రజయ’ నగరాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. కేవలం భవనాలు కడితే సరిపోదని, ప్రజా జీవనం లేకపోతే ఆ నగరం నిరర్థకమవుతుందని అభిప్రాయపడ్డారు.

 

ఐదు దశాబ్దాల పోరాటం తర్వాత వైసీపీ హయాంలోనే విశాఖ రైల్వే జోన్ సాధ్యమైందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దానిపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. రైల్వే జోన్ కోసం తాను చేపట్టిన దీక్షపై కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తూ, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

 

కీలకమైన కేకే (KK) రైల్వే లైన్ ఒడిశాకు వెళ్లిపోతుండటం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని అమర్నాథ్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వం రాజీపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ ఎప్పుడూ అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉంటుందని, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. కేవలం ఒకే ప్రాంతంపై దృష్టి పెట్టి మిగిలిన రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ANN TOP 10