ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలు హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించాయి. ఈ కీలకమైన జలమార్గాన్ని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ఈ ఘర్షణ నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా నేవీకి చెందిన గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జలసంధిని దాటినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. అయితే, ఈ ఆపరేషన్ కోసం టెహ్రాన్ అధికారులతో ఎలాంటి సమన్వయం చేసుకోలేదని యాక్సియోస్ అనే మరో మీడియా సంస్థ తెలిపింది.
ఈ అంశంపై తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ స్పందించారు. “మేము ఇప్పుడు హర్మూజ్ జలసంధిని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నాం” అని ఆయన తెలిపారు. చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఇది మేలు చేస్తుందని, ఆ దేశాలకు ఈ పని చేసే ధైర్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణలో ఇరాన్ భారీగా నష్టపోతోందని ట్రంప్ అన్నారు. అయితే, ఇరాన్ సముద్రంలో అమర్చిన మైన్‌ల వల్ల ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని అంగీకరించారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ ఈ కీలక జలమార్గాన్ని దాదాపుగా దిగ్బంధించింది. ప్రపంచంలోని ముడిచమురు రవాణాలో ఐదో వంతు ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఈ ఘర్షణకు ముగింపు పలికేందుకు ఇరు దేశాల సీనియర్ అధికారులు పాకిస్థాన్‌లో నేడు చర్చలు ప్రారంభించినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది.








