సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్ చేపట్టింది. శనివారం నాడు హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్‌లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాయి. దీని మార్కెట్ విలువ రూ.15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా, భూకబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎం.ఏ. ముఖీం నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇందులో 40 ఎకరాల్లో నిర్మించిన విలాసవంతమైన గెస్ట్ హౌస్, ఫామ్‌హౌస్‌తో పాటు, అతని సోదరుడు ఎం.ఏ. అజీం 2.20 ఎకరాల్లో కట్టిన 6 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను కూడా కూల్చివేశారు. స్విమ్మింగ్ పూల్, పశువుల పాకలు, గుర్రాల కోసం నిర్మించిన షెడ్లను సైతం తొలగించారు.
అయితే, ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు మైకుల ద్వారా ప్రకటించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ చర్యతో, ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న పాత లేఅవుట్ల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
అమీన్‌పూర్ మండలం ఈలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1 నుంచి 220 వరకు ఉన్న 1,263 ఎకరాల భూమి నిజాం పాలకులకు చెందినదిగా రికార్డుల్లో ఉంది. విలీన ప్రక్రియ తర్వాత ఇది ప్రభుత్వ భూమిగా మారింది. ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని 1998లోనే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అనంతరం 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ భూమి ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది.
అయినప్పటికీ, కోర్టు ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా ముఖీం 2006లో ఇక్కడ భారీ నిర్మాణాలు చేపట్టారు. అంతేకాకుండా, స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధాలు కొనసాగిస్తూ ఈ భూమిలో ఇష్టానుసారంగా అమ్మకాలు జరుపుతూ వందల కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చట్టాలను, అధికారులను లెక్కచేయకుండా సాగిస్తున్న ముఖీం అక్రమాలకు తాజా ఆపరేషన్‌తో ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. మొత్తం 1,263 ఎకరాల్లో ఇప్పటికే నిర్మాణాలు జరిగిన ప్రాంతాన్ని మినహాయించి, ఖాళీగా ఉన్న 861 ఎకరాల భూమిని పూర్తిగా తన అధీనంలోకి తీసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.









