AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుపతిలో పీ4 వార్షికోత్సవం..!

పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో సోమవారం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ పథకాలకు భిన్నంగా, మానవతా దృక్పథంతో పేద కుటుంబాలను ఆదుకునే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సాధించిన ప్రగతిని ఈ వేడుకల్లో వివరించారు.

 

ఈ కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక ఆడియో, వీడియో (ఏవీ) ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. పీ4 కార్యక్రమం ద్వారా గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 10.39 లక్షల పేద కుటుంబాలను ‘మార్గదర్శులు’ దత్తత తీసుకున్నట్లు ఏవీలో వెల్లడించారు. వీరిలో ఇప్పటికే 2.1 లక్షల కుటుంబాల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురాగలిగామని తెలిపారు. సమాజంలోని ధనిక వర్గాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ‘మార్గదర్శులు’గా వ్యవహరిస్తూ పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా దత్తత తీసుకుంటున్నారు. వారికి జీవనోపాధి మార్గాలు చూపడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ, పిల్లల చదువుకు చేయూత, గృహ నిర్మాణం వంటి అనేక రూపాల్లో సహాయం అందించి వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మార్గదర్శులు, లబ్ధి పొందిన బంగారు కుటుంబాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నేడు లబ్ధి పొందుతున్న బంగారు కుటుంబాలు భవిష్యత్తులో ఇతరులకు సహాయం చేసే మార్గదర్శకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కేవలం ప్రభుత్వ పథకాలతోనే కాకుండా, పౌర సమాజ భాగస్వామ్యంతో పేదలను పైకి తీసుకురావాలనే ఆలోచన అద్భుతమని పలువురు మార్గదర్శకులు ప్రభుత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో సరికొత్త సామాజిక మార్పుకు నాంది పలుకుతోందని అభిప్రాయపడ్డారు.

ANN TOP 10