భారతీయ జెండాలు కలిగిన రెండు ఎల్పీజీ కంటైనర్లు బీడబ్ల్యూ ఈఎల్ఎం, బీడబ్ల్యూ టీవైఆర్‌లు హర్మూజ్ జలసంధిని దాటాయి. శక్రవారం నాడు దుబాయ్ రస్‌ఆల్‌ఖైమాకు ఉత్తరాన లంగర్ వేసిన ఐదు నౌకలలో ఇవి కూడా ఉన్నాయి. ఈఎల్ఎం నౌక హెచ్‌పీసీఎల్‌ది కాగా, టీవైఆర్ నౌక బీపీసీఎల్‌కు చెందినది. భారత్ సహా మిత్రులైన ఐదు దేశాల నౌకల కోసం హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎల్పీజీని తీసుకువస్తున్న రెండు నౌకలు సురక్షితంగా హర్మూజ్‌ను దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు నౌకల్లో 90,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీ గ్యాస్ వస్తోంది. ఈ రెండు నౌకలు హర్మూజ్‌ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరికొన్ని భారతీయ ట్యాంకర్లు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ సమీపంలోని జలాల్లో ఇరాన్ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. కాగా, 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌తో కూడిన జగ్ వసంత్ ట్యాంకర్ నౌక గుజరాత్‌లోని వదినార్ పోర్టుకు చేరుకుంది.








