AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ రోజు నా చేతిలో తుపాకీ ఉంటే కాల్చిపడేయాలనిపించింది: అచ్చెన్నాయుడు..

గత ప్రభుత్వ హయాంలో సభలో చంద్రబాబుకు, తమకు జరిగిన అవమానాలు చూశాక.. తన దగ్గర తుపాకీ ఉంటే కాల్చిపడేసేవాడిని అనిపించేంత ఆవేదన, కోపం కలిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తిట్లు పడటానికే రాజకీయాల్లోకి వచ్చామా అని ఆ రోజు ఆవేదన చెందానని అన్నారు.

 

గన్నుంటే కాల్చేయాలనిపించింది

గత ప్రభుత్వంలో మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టిన రోజు జరిగిన ఘటనలను అచ్చెన్నాయుడు పూసగుచ్చినట్టు వివరించారు. “ఆ రోజు చంద్రబాబు గారిని, మమ్మల్ని అనరాని మాటలు అన్నారు. ఆ మాటలు వింటే నాలాంటోడికైతే గన్ను ఉంటే కాల్చేయాలి అనిపిస్తుంది. ఇంత దారుణమా? ఈ తిట్లు తినడానికేనా మనం రాజకీయాల్లో ఉన్నది? అనిపించింది. అయినా సరే, చంద్రబాబు గారు ఎంతో ఓపికతో నిలబడ్డారు. ఆయన ఓపికకు జోహార్లు. ఇది మన బాధ్యత అని మాకు ధైర్యం చెప్పారు” అని అచ్చెన్నాయుడు అన్నారు.

 

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు

మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టిన 2020, జనవరి 21వ తేదీని ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అచ్చెన్నాయుడు అభివర్ణించారు. “శాసన మండలిలో మాకు బలం ఉన్నా, వైఎస్సార్సీపీకి కేవలం 8 మంది సభ్యులే ఉన్నా.. బిల్లును అడ్డగోలుగా పాస్ చేయాలని చూశారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ మండలిలోకి వచ్చేశారు. లైట్లు ఆపేశారు, టీవీ ప్రసారాలు నిలిపేశారు. చైర్మన్ షరీఫ్ గారి ఛాంబర్‌ను విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు చుట్టుముట్టి తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చైర్మన్ గారు ధైర్యంగా నిలబడి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి రాష్ట్రాన్ని బతికించారు” అని ఆయన వివరించారు.

 

2019లో ప్రజలు తప్పు చేశారు

2019 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తప్పిదం చేశారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. “2014-19 మధ్య చంద్రబాబు పాలన ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తూ, సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాం. అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడించారో అర్థం కాలేదు. ఎవరో కొత్తగా ఆకాశం నుంచి దిగివచ్చి పార్టీ పెడితే నమ్మి ఓటేస్తే ఫర్వాలేదు. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకుని, 16 నెలలు జైల్లో ఉన్న ఒక దొంగకు ఓటు వేశారనేదే నా బాధ” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

మూడు రాజధానుల పేరిట చిచ్చు

గత ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. “విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పి ఐదేళ్లలో ఏం ఉద్ధరించారు? ఒక్క ఇటుక కూడా వేశారా? కేవలం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. మేము అమరావతే రాజధాని అని ఎన్నికలకు వెళ్లాం, ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. రాజధాని పేరుతో అమరావతి రైతులను, రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఒక శిల్పిలా చంద్రబాబు గారు రాజధానిని చెక్కుతుంటే.. ఒక దుర్మార్గుడు వచ్చి సర్వనాశనం చేశాడు” అని ఆయన విమర్శించారు.

 

అమరావతికి చట్టబద్ధత.. ప్రజలకు విజ్ఞప్తి

అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు గారు కారకుడు, కర్త, క్రియ అని అచ్చెన్నాయుడు అన్నారు. “భవిష్యత్తులో మళ్లీ ఎవరైనా పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టు, రాజధానిని మార్చాలని ప్రయత్నించకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ తీర్మానం చేస్తున్నాం. దీనికి చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపుతున్నాం. ప్రజలారా.. మళ్లీ వైకుంఠపాళి ఆట ఆడొద్దు. ప్రలోభాలకు లొంగి మళ్లీ తప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ బాగుచేయలేరు. మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి” అని ఆయన ప్రజలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ANN TOP 10