AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు….

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దేశ భద్రత, విమానయాన రంగం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం భారీ కేటాయింపులు చేపట్టింది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

 

దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ (IVFRT) ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విదేశీయుల రాకపోకలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు అనుమతి నిచ్చింది. దీనివల్ల వీసా ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, అక్రమ చొరబాట్లను అరికట్టడం సులభతరం అవుతుంది.

 

సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత చేరువ చేసేందుకు UDAN 2.0 పథకానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. పదేళ్ల వ్యవధిలో ఈ పథకం కోసం 28,840 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగాకొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు.

 

దేశవ్యాప్తంగా 200 హెలిప్యాడ్‌లను అత్యాధునిక హంగులతో ఆధునీకరిస్తారు. ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF) కింద 10,043 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.ఈ పథకం ద్వారా కొత్తగా మరో 120 ప్రాంతాలకు విమాన సర్వీసులు విస్తరించనున్నాయి.

 

పర్యావరణ పరిరక్షణ కోసం ‘నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్’ (NDC) విధానానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భాగంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే కాలంలో దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 52 శాతం వాటాను పునరుత్పాదక ఇంధన వనరుల నుండే సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ANN TOP 10