పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఆంక్షలు విధిస్తూనే, భారత్ సహా ఐదు మిత్ర దేశాలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారత నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కీలక జలమార్గం గుండా ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదని, అయితే కొన్ని దేశాల నౌకలపై మాత్రం ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఇరాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్ దేశాల నౌకలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ఆయన వివరించారు. “శత్రు దేశాల నౌకలను ఈ జలసంధి గుండా అనుమతించడానికి ఎటువంటి కారణం లేదు. అందుకే మేం మిత్ర దేశాలుగా భావించే కొన్నింటికి మాత్రమే అనుమతి ఇచ్చాం” అని అరాఘ్చి పేర్కొన్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.
అదే సమయంలో తమ శత్రు దేశాలుగా పరిగణించే అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు ప్రస్తుత సంక్షోభంలో పాలుపంచుకుంటున్న కొన్ని గల్ఫ్ దేశాల నౌకలను హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించకుండా నిరోధిస్తామని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాల తర్వాత ఈ కీలక జలమార్గంపై ఇరాన్ తన అధికారాన్ని, పట్టును నిరూపించుకోవడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో హర్మూజ్ జలసంధిని పాక్షికంగా దిగ్బంధిస్తామని ప్రకటించినప్పుడు, చాలామంది దాన్ని ఒక బూటకపు బెదిరింపుగా కొట్టిపారేశారని అరాఘ్చి గుర్తుచేశారు. కానీ, తాజా పరిణామాలతో ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాలలో ఒకటైన ఈ జలసంధిని నియంత్రించే సామర్థ్యం తమకు ఉందని నిరూపించామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంతో ఇరాన్ తన మిత్ర, శత్రు దేశాల విషయంలో తన వైఖరిని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసినట్లయింది.








