మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో తొలి అడుగుగా, గండిపేట మండలం మంచిరేవులలో భారీ ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మూసీ తీరాన్ని మత సామరస్యానికి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ బృహత్కార్యాన్ని చేపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం పశ్చిమాన జంట జలాశయాల నుంచి తూర్పున ప్రతాపసింగారం వరకు 55 కిలోమీటర్ల పొడవున మూసీ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంచిరేవులలో ఆలయంతో పాటు, పురానాపూల్ వద్ద భారీ మసీదు, గౌలిగూడలో గురుద్వారా, నాగోల్‌లో చర్చి నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు.
మంచిరేవులలో 800 ఏళ్ల వీరభద్రస్వామి, 1400 ఏళ్ల మచిలేశ్వర ఆలయాల సమీపంలో 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సలహాలతో ఆలయ నిర్మాణ శైలిని ఖరారు చేశారు. 64 అడుగుల ఎత్తుతో నిర్మించే దీని గర్భాలయం, యాదాద్రి తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్దదిగా నిలవనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలయం వద్ద 2,000 వాహనాల పార్కింగ్, ఓఆర్‌ఆర్ నుంచి విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, మూసీ నదిపై చిన్న ఆనకట్ట నిర్మించి, నీటిని నిల్వ చేస్తారు. నది మధ్యలో ఏర్పాటు చేసే ఓ దీవిపై 100 అడుగుల శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు, బోటింగ్ సౌకర్యం, పార్కులను కూడా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.700 కోట్లుగా అంచనా వేస్తుండగా, నిధుల సమీకరణకు దాతలు, ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 28న ఉదయం 8:30 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి శృంగేరి పీఠం ప్రతినిధులు హాజరుకానున్నారు.








